సుబ్బలక్ష్మిగారి కలం నుంచి

పురుషోత్తమ ప్రాప్తి యోగము-అన్వయమ


||ఓమ్ తత్ సత్ ||


శ్రీమద్భగవద్గీత
పురుషోత్తమప్రాప్తి యోగము
పదునైదువ అధ్యాయము ు

భక్తి ద్వారా త్రిగుణములు దాటవచ్చని భక్తి ద్వారా బ్రహ్మసాక్షాత్కారముపొందవచ్చని అనన్యభక్తి చేత ఆ పురుషోత్తముని ఆపరమాత్మను పొందవచ్చని శ్రీకృష్ణుడు అర్జునునకు గుణత్రయ విభాగ యోగములో వివరించెను.

పురుషోత్తముడనగా ఆపరమాత్మ . ఉపాధి అనగా శరీరమను క్షరపురుషుని కంటెను , జీవుడను అక్షరపురుషుని కంటెను వేరై వారిరువురుకంటెను ఉత్తముడై పరగుటవలన పరమాత్మకు పురుషోత్తముడని పేరు వచ్చినది. పురుషోత్తముడిని పొందుటకు మార్గము ఈ అధ్యాయమునందు తెలుపబడినది కవున ఉరుషొత్తమ ప్రాప్తి యొగము అన్నారు.

విషయవిరక్తి వైరాగ్యము బోధించుటకు దృశ్యరూప సంసారము ఒక అశ్వత్ధ వృక్షముతో పోల్చబడినది. పైనవ్రేళ్ళు క్రిందకొమ్మలు కలది వేదములే ఆకులు కల ఈ సంసార వృక్షము ఊర్ధ్వమున యున్న బ్రహ్మమునయుండి యే ఆవిర్భవించినది. మాయ అనగా(అవిద్య) ఎలాగ అనిత్యమైనది నిత్యము గాను, దుఃఖమును సుఖముగాను, అనాత్మను ఆత్మగాను తోపింపజేయునో అలాగే పైనున్న పురుషొత్తముని నుంచి అవిర్భవించిన తలక్రిందులుగానున్న సంసారవృక్షమును పురుషోత్తమునితో సంబంధము లేని వృక్షము వలే కనిపింపచేయును. అలాగే బ్రహ్మమార్గమున నున్నవారికి ఈ సంసారవృక్షము అవరోధము కల్పించుచున్నది.

అశ్వత్ధము అనగా రేపు యుండునోలేదోనని సందేహముతో నున్నది నాశరహితమైనది అనాదికాలము నుండి కోట్లకొలది జన్మలనుండి బాగాధృఢపడుతూవచ్చి శాఖోపశాఖలుగా విస్తరించి యున్నది. కర్మవాసనలే దీని వ్రేళ్ళు. సత్వరజోతమోగుణమలచే శబ్దాది గుణములచే దీని చిగుళ్ళు వృద్ధి యగుచున్నవి. ఈ సంసార వృక్షమునకు ,ఈ జగత్తుకి ఆధారము బ్రహ్మమని ఎరిగినవాడే వేదార్ధము నెరిగినవాడు.

అసంగ మనగా ప్రాపంచిక విషయ విరక్తి అభిమానము లేకుండుట. అట్టి అసంగము అనే బలమైన ఖడ్గముచేత సంసార వృక్షమును చేదించవలెను. మంద మందవైరాగ్యముచే ఈ సంసారవృక్షము ఛెదింపబడదు. తీవ్ర విరక్తికి పరిపూర్ణ అసంగము ఆవశ్యకమై యున్నది.
అభిమానములే నివారు దృశ్య పదార్దములయందు ఆశక్తి లేనివారు ఆత్మ స్థితియందుండువారు కోరికలను జయించినవారు సుఖదుఃఖాదులను విడచిపెట్టినవారు మూఢత్వము లేనివారు మాత్రమే పరమాత్మను పొందగలరు.
పరమాత్మస్థానము సూర్యచంద్రాగ్నులు ప్రకాసింపచేయజాలవు. ఆత్మ బుద్ధిని, బుద్ధి నేత్రమును, నేత్రము సూర్యచంద్రాగ్నులను ప్రకాశింపజేయచున్నవి.

జీవుడు వాస్తవముగా భగవదంశస్వరూపుడు తానుశరీరమని తలచి ఇంద్రియములతో మనస్సు తో కాలక్షేపము చేయుచున్నడు. వాయువు సుగంధవస్తువులు గానీ దుర్గంధవస్తువులుగాని ఎలాతీసుకొనిపోవునో అలాగ జీవుడు పాత శరీరము వీడి క్రొత్త శరీరము ధరించినపుడు మనస్సును ఇంద్రియము లను వాటియందుండు సంస్కారములను( వాసనలు) గైకినిపోవుచున్నాడు. జీవుడు చెవి ముక్కు కన్ను చర్మము అనే జ్ఞానేంద్రియములను మనస్సుఆశ్రయించివిషయములను అనుభవించుచున్నాడు.

ఆత్మనాత్మవివేకమున్నవారు , చిత్త శుద్ధికలిగిన వారు, ధ్యానాదిప్రయత్నము చేసినవారు మాత్రమే పరమాత్మను తెలిసికొనగలరు. పరమాత్మయే భూమి యందు ప్రవేసించి బలముచే సమస్త ప్రాణులను భరించు చున్నాడు. చంద్రుడై సస్యములను పోషించు చున్నాడు.

శ్లో||అహంవైశ్వానరోభూత్వ ప్రాణినాందేహమాశ్రితః,
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్|| 14||

మనము భుజించు ఆహారమును పరమాత్మయే ఒసంగుచున్నాడు. ఆ అన్నమును తానే పచనము చేయుచున్నాడు. వైశ్వానరుడను జఠరాగ్నిగా అయి ప్రాణులయొక్క శరీరములో ప్రాణవాయువు సహాయముతొ నాలుగువిధములుగా పచనము చేయుచున్నడు. అవే
భక్ష్యము - కొరుక్కొని తినేది
భోజ్యము - చప్పళించి తినేమెత్తనైన అన్నము
లేహ్యము - నాలుకతో రుచి చూచే పచ్చళ్ళు
చోష్యము -పాయసము మొదలగు నవి.

సాత్వికమైనది న్యాయార్జితమైనది దేవునికి సమర్పించినది అయిన అహారమునే భుజించవలెను.

భోజనసమయములో ఈ అధ్యాయము పురుషోత్తమప్రాప్తియోగము పరాయణముచేసి తినుట ఆచారము అయినది ఈ అధ్యాయము చెప్పి చివరకు చేతిలో తీర్ధము తీసుకొని బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః అనే శ్లోకము నాలుగవ అధ్యాయములో 24 శ్లోకముచదివి ఆ నీరు అన్నము మీద చల్లి భుజించుట ఉత్తమము.

సమస్త ప్రాణుల హృదయమున యుండి తెలివి మరపు కలిగించువాడు వేదములచే తెలియతగిన వాడుపరమాత్మ .
ఈ ప్రపంచమున క్షరుడు అక్షరుడు అను ఇద్దరు పురుషులు కలరు. సమస్త ప్రాణుల దేహాద్యుపాధులు క్షరపురుషుడని చెప్పబడినది. కూటస్థుడగు జీవుడు అక్షరపురుషుడు. వారికన్నవేరైనవాడు ఉత్తముడు. అతడే పురుషోత్తముడు. అతడే పరమాత్మ.
కొందరు దేహస్థితియందును కొందరు జీవస్థితి యందురు వారిరువురు సామాన్యపురుషులు. పురుషోత్తమ స్థితి ప్రయత్న పుర్వకముగా సంపాదించవలెను. ఏల్లకాలము బద్ధ స్థితియందు అనగా జీవస్థితి యందుండుట సరియైనదికాదు క్రమముగా దేహస్థితిని జీవస్థితినీ దాటి సాక్షి యగు ఆత్మ స్థితికి పురుషోత్తమ స్థితికి వచ్చినవాడే ధన్యుడు.

అట్టి స్థితి యే జీవితపరమావధి.
దానిచే జన్మసార్ధకమగును.

భగవానుని పూర్ణమనస్సుతో సేవించిన ధ్యానించిన అతడు జన్మ సార్ధకత పొందినవాడగును.
భగవానుడు బోధించిన అధ్యాత్మశాస్త్రము అతి రహస్యమైనది.
దీనిని ఆచరించినవాడు ధన్యుడగును.
పురుషోత్తమప్రాప్తియోగము సమాప్తము
|| ఓం తత్ సత్||




||ఓం తత్ సత్ ||

 

 


.